Sexual Harrasment on Plane: విమాన ప్రయాణికురాలితో జిందాల్ గ్రూప్ సీనియర్ అధికారి అభ్యంతరకర ప్రవర్తన!
- కోల్‌కతా నుంచి బోస్టన్‌కు బయలుదేరిన మహిళ
- అబుదాబీకి కనెక్టింగ్ ఫ్లైట్‌లో వెళుతుండగా మాట కలిపిన తోటి ప్రయాణికుడు
- జిందాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌గా తనని తాను పరిచయం చేసుకున్న నిందితుడు
- అశ్లీల వీడియోలు చూపిస్తూ యువతిని అభ్యంతరకరంగా తాకిన వైనం
- ఎక్స్ వేదికగా యువతి ఫిర్యాదు, స్పందించిన సంస్థ చైర్మన్, చర్యలు తీసుకుంటామని హామీ
జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తనను అసభ్యకరంగా తాకారని ఓ ప్రయాణికురాలు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేసింది. కోల్‌కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు 28 ఏళ్లు. ఓ సంస్థను నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల కోల్‌కతా నుంచి బోస్టన్‌కు బయలుదేరిన ఆమె అబుబాదీకి ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ట్రాన్సిట్ ఫ్లైట్ ఎక్కింది. విమానంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తనని తాను దినేశ్ ఆర్ సరోగీగా పరిచయం చేసుకున్నాడు. అతడి వయసు 65 ఉండొచ్చని ఆమె పేర్కొంది.
తొలుత తన హాబీల గురించి చెప్పిన ఆయన, తన సెల్ఫోన్లో కొన్ని వీడియోలు ఉన్నాయంటూ అసభ్య చిత్రాలు చూపించాడని పేర్కొంది. తాను షాకైపోయిన సమయంలో శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడని పేర్కొంది. వెంటనే తాను తేరుకుని వెళ్లి క్రూ సిబ్బందికి ఫిర్యాదు చేశానని, వారు పోలీసులకు సమాచారం అందించారని తెలిపింది. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారని, అయితే, తను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే బోస్టస్ ఫ్లైట్ మిస్సయ్యే అవకాశం ఉండటంతో కంప్లయంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.
అయితే, తనకు ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై జిందాల్ గ్రూప్ చైర్మన్ స్పందించారు. నిందితుడి గురించి ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తమ ఉద్యోగులు ఇలా ప్రవర్తిస్తే అస్సలు సహించమని అన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించానని, తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.