UPI Payments: యూపీఐ పేమెంట్లకు ఎనలేని ఆదరణ.. ప్రతినెలా ఆశ్చర్యకర స్థాయిలో కొత్త వినియోగదారులు
- ప్రతి నెలా జత కలుస్తున్న 60 లక్షల మంది నూతన యూపీఐ చెల్లింపుదార్లు
- ఏడాది ప్రాతిపదికన 49 శాతం మేర పెరిగిన పేమెంట్లు
- రోజువారీగా యూపీఐ చెల్లింపుల మొత్తం విలువ రూ.66,903 కోట్లు
- గణాంకాలు విడుదల చేసిన ఎన్పీసీఐ
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు అంతకంతకూ వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్లకు ఎనలేని ఆదరణ పెరుగుతోంది. ప్రతి నెలా ఏకంగా 60 లక్షల మంది నూతన వినియోగదారులు యూపీఐ చెల్లింపులు మొదలుపెడుతున్నారని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా పేర్కొంది. ఈ మేరకు జూన్ నెల డేటాను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 49 శాతం మేర పెరిగి 13.9 బిలియన్లకు చేరిందని తెలిపింది. ఇక లావాదేవీల విలువ 36 శాతం పెరిగి రూ.20.1 లక్షల కోట్లకు చేరిందని ప్రకటించింది.
రోజువారీ యూపీఐ లావాదేవీల సంఖ్య 463 మిలియన్లు ఉంటుందని, రోజువారీ పేమెంట్ల సగటు విలువ రూ.66,903 కోట్లుగా ఉంటుందని ఎన్పీసీఐ పేర్కొంది. యూపీఐపై రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు అవకాశం ఇవ్వడం, విదేశీ దేశాలలో సైతం యూపీఐ సేవలను ప్రారంభించడంతో యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగేందుకు దోహదపడింది. ఈ పరిణామంపై ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ స్పందించారు. రూపే క్రెడిట్ కార్డుల మార్కెట్ వాటా మూడేళ్ల క్రితం కేవలం 1 శాతంగా ఉండగా ఇప్పుడు 10 శాతానికి పెరిగిందని ప్రస్తావించారు.
కాగా భారత్‌లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థను అనేక దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ మేరకు ప్రపంచ దేశాలకు భారత్ సహకారం అందిస్తోంది. ఇటీవలే యూఏఈలోని ‘అల్ మాయా సూపర్‌మార్కెట్’ దేశంలోని తన స్టోర్లలో యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద కూడా యూపీఐ పేమెంట్లు అందుబాటులో ఉన్నాయని ఎన్పీసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి ప్రస్తావించారు. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఈ పేమెంట్లకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో రోజుకు 1 బిలియన్ యూపీఐ లావాదేవీలను సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఆయన చెప్పారు.