Pemmasani Chandra Sekhar: అతను రోడ్డు మీదికి వస్తే రాష్ట్రాభివృద్ధి వెనక్కి వెళుతుంది: కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని
- దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపడతామన్న జగన్
- జగన్ వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందన్న పెమ్మసాని
- నాడు చంద్రయ్యను చంపేస్తే జగన్ ఎందుకు మాచర్ల వెళ్లలేదన్న పెమ్మసాని
- ఇప్పుడు ఢిల్లీలో నిరసన తెలిపే అర్హత జగన్ కు లేదని స్పష్టీకరణ
ఏపీలో గత 45 రోజులుగా జరుగుతున్న పరిణామాలపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపడతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడంపై కేంద్ర రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. జగన్ వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. అతను రోడ్డు మీదికి వస్తే రాష్ట్రాభివృద్ధి అంతా వెనక్కి వెళ్లిపోతుందని స్పష్టం చేశారు.
"జగన్ కు నిరసన తెలిపే అర్హత ఎక్కడుంది? మాచర్లలో చంద్రయ్యను అతి కిరాతకంగా చంపారు. అదీ... రాజకీయ హత్య అంటే! ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవను రాజకీయం చేయాలని చూస్తున్నారు. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య ఎలా అవుతుంది? మాచర్లలో జరిగింది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వు ఏం చేశావ్? బయటికి వచ్చావా? మాచర్ల వెళ్లావా?
రాష్ట్రాన్ని అత్యంత అవినీతిమయంగా, ఘోరంగా, అభివృద్ధి లేకుండా చేశారు. నీకేం అర్హత ఉందని ఢిల్లీ వెళతావు? ఢిల్లీలో ఎక్కడికి వెళ్లినా ఏపీ గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్ గురించి ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఢిల్లీలోనే కాదు, ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఆయన ఖ్యాతి పాకిపోయింది!" అంటూ పెమ్మసాని విమర్శనాస్త్రాలు సంధించారు.