Uttam Kumar Reddy: కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదని భావిస్తున్నామన్న మంత్రి
- బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంను అట్టహాసంగా చేపట్టిందని విమర్శ
- కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపణ
కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన నేషనల్ డ్యామ్ సేఫ్టీ మీటింగ్కు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదనే తాము భావిస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అట్టహాసంగా చేపట్టిందన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిందని గుర్తు చేశారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు లేవనే కారణంతో మేడిగడ్డ దగ్గర కట్టారని మండిపడ్డారు. తుమ్మడిహట్టి వద్ద కట్టి ఉంటే మరోలా ఉండేదన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను ప్రతిపాదించిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కమీషన్ల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం నిర్మించిందని ఆరోపించారు. అందుకోసం హైక్లాస్ లోన్స్ తీసుకు వచ్చారన్నారు. కాళేశ్వరం కట్టింది కమీషన్ల కోసమే అన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామన్నారు.