Lavu Sri Krishna Devarayalu: 35, 36 అంటున్నారు... ఆ లెక్కలు శుద్ధ తప్పు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం
- సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- చంద్రబాబు ఆధ్వర్యంలో న్యాయం వైపు నిలబడి ఉన్నామని వెల్లడి
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం నరసరావుపేట ఎంపీ, లోక్ సభలో టీడీపీ సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ఉపేక్షించేది లేదని నేటి సమావేశానికి హాజరైన ఎంపీలకు, రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారని వెల్లడించారు. ఈ సందేశాన్ని ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలని చంద్రబాబు సూచించారని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై స్వయంగా తానే దృష్టి పెడతానని, శాంతి భద్రతలను నెలకొల్పేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.
"35, 36 (హత్యలు) అని వాళ్లు (వైసీపీ) చెబుతున్న లెక్కలు శుద్ధ తప్పు. 35, 36 అంటున్నారు కదా... దయచేసి వాళ్ల పేర్లు, అడ్రస్ లు ఇవ్వండి. ఏ పార్టీయో, కులమో, మతమో చూసే వ్యవహారం కాదిది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో న్యాయం వైపు నిలబడి ఉన్నాం. న్యాయం చేయడానికే ఉన్నాం. ఈ 35 నెంబరు అనేది అవాస్తవం.
వినుకొండలో జరిగిన ఘటనను పూర్తిగా పక్కదోవ పట్టిస్తున్నారు. అది ఇవాళ్టి వివాదం కాదు. గత రెండేళ్లుగా ఆ గొడవ నడుస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు రాజకీయ రంగు పులుముతున్నారు. హత్య చేసిన యువకుడు రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేడు.
ఇవాళ ఆరోపణలు చేస్తున్న జగన్... రెండేళ్ల క్రితమే వివాదం తలెత్తినప్పుడు ఎందుకు న్యాయం వైపు నిలబడలేదు? నాడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ వివాదంలో ఒక గ్రూపుకు కొమ్ము కాసి, మరో గ్రూపుపై తప్పుడు కేసులు పెట్టించి, కొట్టించి, ఇబ్బందులకు గురిచేశారు. ఆ పర్యవసానంగానే వినుకొండ ఘటన జరిగింది. వినుకొండలో జరిగిన ఘటనలో వాస్తవాలు అందరికీ తెలుసు. టీడీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు" అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.