NRI: అమెరికాలో ఆగ్రా యువకుడి కాల్చివేత.. షాకింగ్ వీడియో!
- ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరో వాహనదారుడితో గొడవ
- తుపాకీ తీసుకుని ఆవేశంతో డ్రైవర్ పైకి వెళ్లిన యువకుడు
- కోపంతో అరుస్తుండగా కాల్పులు జరిపిన అమెరికన్
అమెరికాలోని ఇండియానాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనదారుల మధ్య రేగిన గొడవ ఓ ఇండియన్ అమెరికన్ ప్రాణాలు తీసింది. తుపాకీ తీసుకుని తనపైకి వచ్చిన యువకుడిపై అమెరికా పౌరుడు కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ గాయాలపాలైన యువకుడిని ఎమర్జెన్సీ సిబ్బంది ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనలో చనిపోయిన యువకుడు ఇండియాలోని ఆగ్రాకు చెందిన వాడని, రెండు వారాల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ఆగ్రాకు చెందిన గేవిన్ డసౌర్(29) అమెరికాలోని ఇండియానాలో నివాసం ఉంటున్నాడు. జూన్ 29 న మెక్సికన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కిందటి మంగళవారం ఇండియానాలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరో వాహనదారుడితో గేవిన్ గొడవపడ్డాడు. మరో కారులో ఉన్న అమెరికన్ పైకి తుపాకీతో వెళ్లాడు. కారు డోర్ ను కొడుతూ అమెరికన్ పై అరవడం వీడియోలో కనిపిస్తోంది. గేవిన్ అరుపులకు బదులుగా సదరు అమెరికన్ తన తుపాకీ తీసి గన్ పాయింట్ లో కాల్పులు జరిపాడు.
ఇదంతా పక్కనే ఉన్న మరో డ్రైవర్ తన సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన గేవిన్ ను ఆయన భార్య ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో గేవిన్ ను ఐసీయూలో చేర్చి వైద్యులు చికిత్స చేపట్టారు. అయితే, పరిస్థితి విషమించడంతో తాజాగా గేవిన్ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు.