Nagababu: నాకు పదవులపై కోరిక లేదు: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- ఓపిక ఉన్నంత కాలం జనసేన కోసం పనిచేస్తానని వ్యాఖ్య
- పవన్ కల్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు చేతనైనంత చేస్తానంటూ వెల్లడి
- మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీలో ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న కొణిదెల నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓపిక ఉన్నంత కాలం జనసేన కోసం పని చేస్తానని, తనకు ఎటువంటి పదవులపై కోరిక లేదని అన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు చేతనైనంత చేస్తానని పేర్కొన్నారు. మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన కేంద్ర కార్యాలయంలో బీమా చెక్కుల పంపిణీ సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చెక్‌ను అందజేశారు. కార్యకర్తకలకు తన వంతుగా ఎంతో కొంత సాయం అందిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.
కూటమి అధికారంలోకి రావడంతో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల సారధ్యంలో ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బీమా కట్టుకోవడం అలవాటు చేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఒక నిర్మాతగా తాను నష్టపోతే తమ్ముడు పవన్ కల్యాణ్ అండగా నిలిచాడని ప్రస్తావించారు.
వైసీపీ వాళ్లు అప్పుడే వెంటపడుతున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యిందని, అప్పుడే వైసీపీ వాళ్లు మొరగడం ప్రారంభించారని నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆయన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదని, ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని అని నాగబాబు ఆరోపించారు. గత ఐదేళ్లల్లో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయటపెడతామని నాగబాబు హెచ్చరించారు. తాము కనీసం ఆరు నెలలు అయినా వేచిచూశామని, వైసీపీ వాళ్లు నెల రోజులకే కుక్కల్లాగా వెంట పడుతున్నారని విమర్శించారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని, చేసిన అవినీతి, అక్రమాలకు చట్ట పరంగా శిక్ష తప్పదని నాగబాబు హెచ్చరించారు.