Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. డెమోక్రాట్ల కొత్త అభ్యర్థి ఎవరు?
- కమలా హారిస్ ను ప్రతిపాదించిన బైడెన్
- బైడెన్ తప్పుకున్న వెంటనే హారిస్ కు పెద్ద మొత్తంలో విరాళాలు
- రేసులో వెస్ట్ వర్జీనియా సెనేటర్ జో మంచిన్
అమెరికా అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో కొత్త అభ్యర్థిగా డెమోక్రాట్లు ఎవరిని నిలబెడతారనేది ఆసక్తికరంగా మారింది. బైడెన్ పోతూ పోతూ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల హడావుడి నెలకొన్న నాటి నుంచే బైడెన్ తప్పుకునే అవకాశం ఉందని, ఆయన స్థానంలో కమలా హారిస్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అన్నట్లుగానే బైడెన్ తప్పుకున్నారు. అయితే, హారిస్ నే డెమోక్రాట్లు కొత్త అభ్యర్థిగా ప్రకటిస్తారా.. బైడెన్ తప్పుకోవాలంటూ డిమాండ్ చేసిన సీనియర్ నేతలంతా హారిస్ కు మద్దతు తెలుపుతారా? అంటే అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ట్రెండ్ మాత్రం కమలా హారిస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. బైడెన్ లేఖ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే కమలా హారిస్ కు పెద్ద మొత్తంలో విరాళం అందింది. ఈ ఏడాది ఎన్నికల్లో ఇప్పటి వరకూ అటు డొనాల్డ్ ట్రంప్ కు కానీ ఇటు బైడెన్ కు కానీ ఇప్పటి వరకు అందనంత మొత్తం.. ఏకంగా 46 మిలియన్ డాలర్లు హారిస్ అందుకున్నారు. దీంతో డెమోక్రాట్ల అభ్యర్థిగా హారిస్ నే ప్రకటిస్తారనే నమ్మకం పార్టీ మద్దతుదారులలో బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
డెమోక్రాటిక్ అధ్యక్ష రేసులో హారిస్ తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు వెస్ట్ వర్జీనియా సెనేటర్ జో మంచిన్.. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలంటూ మంచిన్ ఇటీవల మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. కొత్తతరం నాయకులకు అవకాశం ఇచ్చేందుకైనా బైడెన్ తప్పుకోవాలని కోరారు. తద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గాజా వార్ తదితర అత్యవసర అంశాలపై మరింత మెరుగ్గా దృష్టి పెట్టే అవకాశం బైడెన్ కు లభిస్తుందని చెప్పారు. డెమోక్రాట్ల నేతల చూపు మొత్తం జో మంచిన్ వైపే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా, ఒకటి రెండు రోజుల్లో డెమోక్రాట్ల కొత్త అభ్యర్థి ఎవరనేది తేలిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.