Jagan: అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులతో జగన్ వాగ్వాదం
- అసెంబ్లీకి నల్ల కండువాలు, ప్లకార్డులతో వచ్చిన జగన్, వైసీపీ సభ్యులు
- ప్లకార్డులు తీసుకెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు
- పోలీసుల తీరు దారుణంగా ఉందన్న జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలు, బ్యాడ్జీలతో వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేట్ వద్దే అడ్డుకున్నారు. ప్లకార్డ్స్ తీసుకెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్ కు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు.
ప్లకార్డులను లాక్కుని, చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమని చెప్పారు. ప్లకార్డులను ఆపాలని ఎవరు ఆదేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు. చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాలని మండిపడ్డారు. మరోవైపు సభ ప్రారంభం అవుతుండటంతో... నల్ల కండువాలతోనే సభలోకి వైసీపీ సభ్యులను పోలీసులు అనుమతించారు. ఇంకోవైపు, సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే జగన్ సభ నుంచి బయటకు వచ్చారు.