Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం.. వెంటనే మదనపల్లెకు వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్ లకు సీఎం ఆదేశం
- ఉద్దేశపూర్వకంగానే కీలక ఫైళ్లను దగ్ధం చేశారని ఆరోపణలు
- అత్యవసర విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి
- హెలికాఫ్టర్ లో మదనపల్లెకు వెళ్లాలంటూ డీజీపీ, సీఐడీ చీఫ్ కు ఆర్డర్
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూములకు సంబంధించిన పలు కీలక ఫైళ్లు దగ్ధం అయినట్లు సమాచారం. అయితే, ఈ అగ్ని ప్రమాదం వెనక కుట్ర కోణం ఉందనే ఆరోపణలతో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. వెంటనే మదనపల్లెకు వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్ లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ, సీఐడీ చీఫ్ హెలికాఫ్టర్ లో మదనపల్లెకు బయలుదేరనున్నారు.
కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకోవడానికి ముందు ఆఫీసులో అగ్నిప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా పంచిపెట్టిందని, వైసీపీ కార్యకర్తలు, నేతలకు కట్టబెట్టిందనే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే తాజా అగ్నిప్రమాదం జరగడంపై ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల పంపకానికి సంబంధించిన ఆనవాళ్లు తుడిచేసేందుకే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పలు ప్రభుత్వ ఆఫీసులలో అగ్ని ప్రమాదాలు జరగడం, కీలక ఫైళ్లు తగలబడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. వెంటనే మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి అగ్ని ప్రమాదానికి కారణం తేల్చాలని, తగలబడిపోయిన ఫైళ్ల వివరాలపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు.