NEET-UG Paper Leak Row: నీట్ అంశంపై లోక్ సభలో రగడ... కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శల దాడి
- నేడు ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- తొలి రోజే దద్దరిల్లిన లోక్ సభ
- నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఏకిపారేసిన విపక్షాలు
- ఏడేళ్లుగా నీట్ పేపర్ లీక్ అవుతోందని ఆరోపణలు
- అందుకు ఆధారాలేమీ లేవన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై రగడ చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో పరీక్షల వ్యవస్థ అత్యంత లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ అంశంలో అందరిపై నిందలు వేస్తున్నారు తప్ప, తమను తాము నిందించుకోవడంలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవాళ లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నీట్ పేర్ లీక్ అంశంపై విపక్షాలు దాడికి దిగాయి. గత ఏడేళ్లుగా నీట్ పేపర్ లీక్ అవుతోందని ఆరోపించాయి.
అయితే, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఆరోపణలను ఖండించారు. నీట్ పేపర్ ఎప్పటి నుంచో లీక్ అవుతోంది అనేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ, దేశంలో మెరుగైన పరీక్షల నిర్వహణ వ్యవస్థను రూపొందించేందుకు ఏం చేయాలనేది సభ్యులు చర్చిస్తే బాగుంటుందని సూచించారు.
ఇవాళ లోక్ సభలో రాహుల్ గాంధీతో పాటు అఖిలేశ్ యాదవ్, డీఎంకే సభ్యుడు వీరాస్వామి నీట్ అంశంలో కేంద్రంపై పదేపదే ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు.
దీనిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ... ఈ అంశంలో దాచిపెట్టేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను సుప్రీంకోర్టుకు తెలియజేశామని, ఇప్పటికే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పారు.