BRS: రేవంతూ... నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ పరువు తీస్తున్నావ్: బీఆర్ఎస్
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపాటు
- మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ ప్రాజెక్ట్ అంచనా ఎందుకు పెంచారని ప్రశ్న
- పెరిగిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికి అని ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మహానగరం పరువు తీస్తూ... ఇంకా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ విమర్శించింది. సున్నాలు, కన్నాలు వేసే రేవంతూ... నీ మతిలేని చర్యలతో హైదరాబాద్ నగరం పరువు తీస్తున్నావంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు సంధించింది.
1. బీఆర్ఎస్ హయాంలో ప్రణాళికలు రూపొందించిన మూసీ పునరుజ్జీవ, సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,500 కోట్లు.. ఇప్పుడు అది అమాంతం ఎందుకు పెరిగినట్లు?
2. అదే ప్రాజెక్టుకు తట్ట మట్టి ఎత్తకుండా వ్యయాన్ని రూ.16,500 కోట్ల నుండి రూ. 1,50,000 కోట్లకు ఎందుకు పెంచినట్లు?
3. పెరిగిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎవరి జేబులు నింపడానికి?
4. మొదట మూసీ సుందరీకరణకు రూ. 50,000 కోట్లు అవసరమని నువ్వే అన్నావ్.. ఇప్పుడు అదే నోటితో రూ. 1,50,000 కోట్లు కావాలి అంటున్నావ్. అది నోరా.. లేక మోరా?
5. 3-4 నెలల్లోనే లక్ష కోట్ల వ్యయం ఎలా పెరిగింది. ఈ సొమ్ము అంతా ఢిల్లీకి కప్పం కట్టడానికా?
6. పనులు మొదలవ్వకముందే అంచనాలు పెంచి.. ప్రజల సొమ్మును పందికొక్కుల్లాగ తినడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటి. ఈ మూసీ ప్రాజెక్టు కూడా ఆ కోవలోకి చెందిందేనా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.
'గుంపు మేస్త్రి.. మూసీ ప్రక్షాళన కంటే ముందు, నీ నోటిని ప్రక్షాళన చేసుకో. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేయకుండా పూటకో మాట మార్చి నోటికొచ్చింది మాట్లాడకు. ఇలాగే అరుస్తూ వెళితే రంగు పడుద్ది' అని హెచ్చరించింది. ప్రతిసారి కేటీఆర్గారిని అమెరికాలో అది చేశావ్, ఇది చేశావ్ అని అవమానిద్దామని చూస్తున్నారు కానీ, సొంతగా పనిచేసే ప్రతి ఒక్క ఎన్నారైని మీరు అవమానిస్తున్నారని గుర్తుంచుకోండని పేర్కొన్నారు.