Stock Market: బడ్జెట్‌కు ముందు లాభనష్టాల్లో స్టాక్ మార్కెట్ ఊగిసలాట
- 200 పాయింట్ల లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్
- లాభాల్లో ఆర్థిక రంగ, పీఎస్‌యూలు
- కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 80,724 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,569 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో రెండు మూడు మినహా అన్నీ లాభాల్లో ఉన్నాయి. బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు దూసుకెళుతున్నాయి. బడ్జెట్లో నిర్మలమ్మ పాలసీ ప్రకటన చేసే అవకాశముందనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక, పీఎస్‌యూ రంగ కంపెనీలు లాభాల్లో కనిపిస్తున్నాయి. పీఎస్‌యూలు 0.35 శాతం నుంచి 0.7 శాతం మధ్య లాభాలతో ఉన్నాయి.
ప్రముఖ బ్యాంకర్ కేవీఎస్ మణియన్‌ను ఫెడరల్ బ్యాంకు కొత్త సీఈవోగా ఆర్బీఐ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఫెడరల్ బ్యాంకు షేర్లు రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఫెడరల్ బ్యాంకు షేర్ ఈ వార్త రాసే సమయానికి 2 శాతానికి పైగా లాభపడి 197.50 వద్ద ఉంది. అంతకుమందు ఓ సమయంలో 5 శాతానికి పైగా దూసుకెళ్లింది.
అయితే ఉదయం మంచి లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోయి 80,457 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 24,490 పాయింట్ల వద్ద ఉంది.