IAS Officer: గ్యాంగ్ స్టర్ తో పరారైన ఐఏఎస్ భార్య.. తిరిగి వచ్చి ఆత్మహత్య
- భర్త ఇంట్లోకి రానివ్వలేదని విషం తాగిన భార్య
- గుజరాత్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించిన ఐఏఎస్
ఓ ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఓ నేరస్థుడితో పారిపోయింది.. ఓ బాలుడి కిడ్నాప్ లో ప్రియుడికి సహకరించింది. ఈ కేసులో పోలీసులు వెతుకుతుండడంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి భర్త ఇంటికి తిరిగొచ్చింది. అయితే, భార్య చేసిన పనికి అవమానాలపాలైన భర్త ఆమెను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు. గేటు ముందే అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన మహిళ పురుగుల మందు తాగింది. ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన గుజరాత్ లోని గాంధీనగర్ లో చోటుచేసుకుంది.
గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ రంజిత్ కుమార్ భార్య సూర్య జయ్ (45) ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిది నెలల క్రితం ప్రియుడు, గ్యాంగ్ స్టర్ తో ఆమె పారిపోయారు. దీంతో విడాకుల కోసం రంజిత్ కుమార్ కోర్టులో కేసు వేశారు. సదరు గ్యాంగ్ స్టర్ ఓ బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని కాపాడారు. గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులతో పాటు సూర్య జయ్ పైనా కిడ్నాప్ కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు.
దీంతో పోలీసుల నుంచి, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సూర్య జయ్ తన భర్త ఐఏఎస్ రంజిత్ కుమార్ దగ్గరికి తిరిగి వచ్చింది. అయితే, రంజిత్ ఆమెను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు. రంజిత్ ఆదేశాలతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో సూసైడ్ నోట్ రాసి సూర్య జయ్ పురుగుమందు తాగారు. చుట్టుపక్కల వాళ్లు అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. కాగా, భార్య మృతదేహాన్ని తీసుకోవడానికి రంజిత్ నిరాకరించారని పోలీసులు తెలిపారు.