Rahul Dravid: కోచ్‌గా పనిచేసేందుకు గతంలో తాను ఆడిన ఐపీఎల్ ఫ్రాంచైజీతో రాహల్ ద్రావిడ్ చర్చలు!
- రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం
- త్వరలోనే ప్రకటన రావొచ్చంటున్న జాతీయ మీడియా కథనాలు
- కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్‌గా వెళ్లనున్నాడంటూ గతంలో కథనాలు
టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసిపోయింది. టోర్నీని భారత్ గెలవడంతో కోచ్‌గా ఆయనకు చక్కటి ముగింపు లభించింది. అయితే తదుపరి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపిక కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ద్రావిడ్ భావిస్తున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే గతంలో తాను ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా వెళ్లాలని భావిస్తున్నాడని, ఈ మేరకు ఆ జట్టుతో చర్చలు జరుపుతున్నాడంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్, రాహుల్ ద్రావిడ్ మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ సంబంధిత వర్గాలు తెలిపాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. కాగా ఆటగాడిగా, కోచ్‌గా అపారమైన అనుభవంతో పాటు ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలిపించిన నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు వెంటాడుతున్నాయి. ఆయనకు ఆకర్షణీయ ఆఫర్లు చేస్తున్నాయి.
కాగా ఏడాదిలో దాదాపు 10 నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉండడం ఇష్టం లేక భారత జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడలేదు. కానీ, ఐపీఎల్ అయితే ఈ సమస్య ఉండదు. ఏడాదిలో 2-3 నెలలు మాత్రమే టీమ్‌తో ఉంటే సరిపోతుంది. ద్రావిడ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. దీనికి తోడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గతంలో మెంటార్‌గా, కోచ్‌గా ద్రావిడ్ పనిచేశాడు. 2017లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టుతో పాటు ఇండియా-ఏ జట్టు కోచ్‌గా పనిచేశాడు. భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా కూడా ద్రావిడ్ పనిచేశాడు.