Kollu Ravindra: జగన్ రెడ్డి ఎంతగా కక్ష సాధింపులకు పాల్పడ్డారో చెప్పేందుకు ఇది నిదర్శనం: మంత్రి కొల్లు రవీంద్ర
- నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్
- టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి హాజరైన కొల్లు రవీంద్ర
- బాధితుల నుంచి వినతుల స్వీకరణ
ప్రశ్నిస్తే కేసు, ఎదిరిస్తే దాడి అనేలా సాగిన జగన్ రెడ్డి అరాచకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్ర నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
వందలాదిగా తరలి వచ్చిన బాధితులతో మాట్లాడారు. వారి నుండి వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ అక్రమాలు, గనులు మైనింగ్ దోపిడీలపైనే ఫిర్యాదులు రావడంపట్ల కొల్లు రవీంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తప్పులు చేయడమే కాకుండా తిరిగి తమపైనే కేసులు పెట్టినట్లు పలువురు బాధితులు పేర్కొనడంతో, ఆయన అధికారులతో అక్రమ కేసుల అంశంపై మాట్లాడారు. అక్రమ కేసుల విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో నామినేటెడ్ పదవుల కోసం వచ్చిన పార్టీ కార్యకర్తల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రంలో నూతన అధ్యాయం మొదలైందన్నారు. గతంలో ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని, కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసమేనని మరోసారి నిరూపించుకున్నారన్నారు.
మంత్రులు ఎన్ని పనులున్నా, ఎంతటి సమస్యల్లో ఉన్నా ప్రతి రోజూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని నిర్ణయించడం ప్రజల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
ఇవాళ ఇక్కడకు వచ్చిన వారిలో ఎక్కువ మంది అక్రమ కేసుల బాధితులే ఉన్నారని, జగన్ రెడ్డి ఎంతగా కక్ష సాధింపులకు పాల్పడ్డారో చెప్పేందుకు ఇది నిదర్శనం అని వచ్చిన వారితో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికే తాము ఉన్నామని, నిత్యం వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టితో పని చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.