KTR: కేంద్రానికి మీరు మద్దతిచ్చారన్న రేవంత్ రెడ్డి... ఆ సమయంలో కచ్చితంగా ఇచ్చామన్న కేటీఆర్!
- మోదీ తెచ్చిన ప్రతి బిల్లుకూ మద్దతు పలికారన్న రేవంత్ రెడ్డి
- దళిత రాష్ట్రపతి, తెలుగు ఉపరాష్ట్రపతికి మద్దతిచ్చామని కేటీఆర్ కౌంటర్
- రేవంత్ రెడ్డి పరాన్నజీవి అని చురక
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు పలికారని సీఎం విమర్శిస్తే... అవసరమైన వాటికి కచ్చితంగా మద్దతిచ్చామని... కానీ రైతు చట్టాల వంటి వాటికి మాత్రం దూరం జరిగామని కేటీఆర్ తెలిపారు.
అదానీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయిందని కేటీఆర్ ఆరోపించారు. అదానీ, అంబానీలతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని సీఎం అన్నారు. అసలు కేసీఆరే కేంద్రం తెచ్చిన ఎన్నో చట్టాలకు మద్దతు తెలిపారని ఆరోపించారు. నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు... ఇలా ఎన్నింటికో మద్దతు తెలిపారన్నారు. నోట్ల రద్దు గొప్ప నిర్ణయమని కేసీఆర్ అన్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడవద్దని సూచించారు. బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. మీరు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందని కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం అన్నారు. ప్రజలు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్లో అహం తగ్గలేదన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిదని సూచించారు. తాము కేంద్రానికి భయపడుతున్నట్లుగా కేటీఆర్ చెబుతున్నారని... కానీ ఇదివరకు మోదీకి కేసీఆరే ఊడిగం చేశారన్నారు.
జీఎస్టీ తెచ్చినప్పుడు బీఆర్ఎస్ కేంద్రానికి మద్దతు పలికిందన్నారు. పైగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలిపారని విమర్శించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ప్రత్యేక విమానంలో వెళ్లి ఆర్టీఐ సవరణకు ఓటు వేశారన్నారు.
యస్... కచ్చితంగా అందుకే ఓటేశాం: కేటీఆర్
కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు తాము మద్దతు పలికినట్లుగా సీఎం చెబుతున్నారని కానీ అందులో వాస్తవం లేదన్నారు. దళితుడైన రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అవుతుంటే, తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతుంటే తాము కచ్చితంగా మద్దతు పలికామన్నారు. అవును... కేంద్రానికి ఈ విషయాల్లో కచ్చితంగా మద్దతిచ్చామన్నారు. కానీ రైతు చట్టాలకు తాము మద్దతివ్వలేదని స్పష్టం చేశారు.
అయినా రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీజేపీకి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మీద ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. తాము గెలవలేదని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని... తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ రెడ్డిలా తాము పరాన్నజీవులం కాదని... ఉద్యమం సమయంలో పదవులకు రాజీనామా చేశామన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం ఉన్నదే రేవంత్ రెడ్డికి అన్నారు.
సింగరేణిపై చర్చకు సిద్ధం: భట్టివిక్రమార్క
సింగరేణి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కేటీఆర్ వివిధ అంశాలపై సభతో పాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. హైదరాబాద్ పవర్ సర్కిల్‌ను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. ఎవరో పత్రికలో రాసిన దానిని పట్టుకొని సభలో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లలా ఏది పడితే అది చేసేవాళ్లం కాదన్నారు.