Exice Policy: ఎంతో బాధతో మద్యంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నా: సీఎం చంద్రబాబు
- కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- నేడు ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
- మద్యం పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారని విమర్శలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, గత ఐదేళ్లుగా జరిగింది చూస్తే, పాతికేళ్లలో కూడా కోలుకోలేనంత దెబ్బ తగిలిందని అన్నారు. పాలన ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో 2019-24 మధ్య జరిగిన పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుందని చంద్రబాబు వివరించారు.
"కొంతమంది అవసరాల కోసం తప్పులు చేస్తారు. కొందరు అత్యాశతో తప్పులు చేస్తారు. కొందరు డబ్బుల ఉన్మాదంతో తప్పులు చేస్తారు. ఈ ఐదేళ్లలో డబ్బుల ఉన్మాదంతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఎంతో బాధతో నేడు ఎక్సైజ్ విధానంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నాను.
రాష్ట్రంలో మద్యపాన నిషేధం తెస్తామని హామీ ఇచ్చారు. క్రమేణా మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వస్తామని చెప్పారు... మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామన్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉంటే, వాటిని 2,934కి తగ్గించారు. మళ్లీ వాటిని 3,392 షాపులకు పెంచారు. ఏపీ టూరిజం పేరిట 458 దుకాణాలు కేటాయించారు. 2019లో 840 బార్లు ఉంటే, ఇప్పటికీ ఆ బార్లు అలాగే ఉన్నాయి.
పేరుకే మద్యపాన నిషేధం... కమిట్ మెంట్ లేదు... మనసులో మాత్రం వేరే ఉద్దేశాలు పెట్టుకున్నారు. మద్యం ధరలు పెంచుకుంటూ పోతే... మద్యం తాగేవాళ్లు ఆటోమేటిగ్గా తగ్గుతూ వస్తారని చెప్పారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుందట... నాడు ఇదే కుర్చీలో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే అందరూ విన్నారు.
కానీ ధరలు 75 శాతం పెంచారు. అధికారంలోకి వస్తూనే కొత్త జీవో తెచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచారు. రూ.80 ధరను రూ.160కి పెంచారు... రూ.160 ఉండే బాటిల్ ను రూ.320కి పెంచారు.... రూ.240 ఉండే మద్యం బాటిల్ ను రూ.480కి పెంచారు... రూ.480 బాటిల్ ను రూ.960కి పెంచారు... పిచ్చితనం కాకపోతే, మైండ్ ఉండే వాడు ఎవడూ ఇలా చేయడు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోల్చితే మన రాష్ట్రంలో విపరీతంగా ధరలు పెంచేశారు. ఈ అస్తవ్యస్త విధానం ఫలితంగా ఎక్సైజ్ శాఖలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి.
ఆ తర్వాత 2020లో జీవో నెం.256 తీసుకువచ్చారు. ఆ తర్వాత మళ్లీ రేట్లు తగ్గించారు. వీళ్లు 2019 ఎన్నికలప్పుడు చెప్పింది ఏమిటి... క్రమంగా రాష్ట్రంలో మద్యపానం శాతాన్ని తగ్గించుకుంటూ వస్తామన్నారు. కానీ వాస్తవానికి జరిగింది వేరు. మద్యపానం శాతం 2024 నాటికి బాగా పెరిగింది. 2019-20లో ఒక వ్యక్తి సగటున 5.55 లీటర్ల మద్యం సేవిస్తే... అది 2020-21లో 3.37 శాతం, 2021-22లో 4.79 శాతం, 2022-23లో 6.03 శాతం, 2023-24లో 6.23 శాతంగా నమోదైంది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో దొరికే లిక్కర్ ఏపీలో దొరకని పరిస్థితి తీసుకువచ్చారు. ప్రజలకు ఇష్టంలేని బ్రాండ్లను షాపుల్లో ఉంచారు. వాళ్లు ఏ బ్రాండ్లు పెడితే అవే తాగే పరిస్థితి ఏర్పడింది. పొరుగు రాష్ట్రాల్లో ఆదాయం పెరిగింది కానీ, ఏపీ మద్యంపై ఆదాయం తగ్గిపోయింది. మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయినా, ఆదాయం మాత్రం తగ్గింది. తగ్గిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లింది.
పేదవాడు రోజంతా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతాడు. పేదవాడి మద్యం బలహీనతను ఆసరాగా చేసుకుని దోచుకున్నారు. పేదవాడికి అమ్మే లిక్కర్ పై విపరీతంగా ధరలు పెంచేశారు. ప్రధానంగా 5 టాప్ బ్రాండ్ల కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. లోకల్ బ్రాండ్ల రేట్లను పెంచేశారు. బూమ్ బూమ్, ఇతర పేర్లతో రకరకాల బ్రాండ్లు తీసుకువచ్చారు" అని చంద్రబాబు వివరించారు.