Rahul Gandhi: మద్దతు ధరకు చట్టబద్దత కల్పించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీతో సమావేశమైన 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం
- కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేలా ప్రైవేటు బిల్లు పెట్టాలని కోరిన రైతులు
- ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పిన రైతు నేతలు
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఇండియా కూటమి తరఫున కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయనను 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో రైతు సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు.
తమ చిరకాల డిమాండ్ అయిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీని కోరారు. మద్దతు ధర కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని వారికి కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చారు.
ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ: రైతు సంఘాల నేతలు
తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. ఆ రోజు కొత్త క్రిమినల్ చట్టాల ప్రతులను దగ్ధం చేయనున్నట్టు తెలిపారు. ఆగస్ట్ 31న 'ఢిల్లీ ఛలో' మార్చ్ 200 రోజులు పూర్తి చేసుకుంటుందన్నారు. ఆ రోజున పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరి, శంభు, తదితర ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దార్ మర్చా నేతలు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.