Priyanka Chaturvedi: జగన్ గారూ... ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మీ వెంట నిలుస్తాయి: శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
- ఢిల్లీలో జగన్ నేతృత్వంలో వైసీపీ నిరసన కార్యక్రమం
- హాజరైన శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది
- ఏపీలో హింసను ఖండిస్తున్నామని వెల్లడి
- గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్
- సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని విజ్ఞప్తి
ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మద్దతు పలికారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన వీడియో, ఫొటో ఎగ్జిబిషన్ ను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికల తర్వాత ఏం జరుగుతోందో అందరికీ తెలిసేలా చేసిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఈ తరహా చైతన్యవంతమైన వాతావరణం (నిరసన ప్రదర్శన) సృష్టించినందుకు విజయసాయిరెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వివరించారు.
"వాస్తవానికి రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ఢిల్లీకి తెలిసే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో ఢిల్లీ ఎప్పుడో సంబంధాలు కోల్పోయింది. ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోంది. రాజ్యాంగానికి కూడా విలువ ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు వస్తుంటాయి... పోతుంటాయి. కానీ రాజకీయ హింస ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే.
జగన్ గారూ... ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం... ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మీకు మద్దతుగా నిలుస్తాయి. ఇది ఏపీలో మాత్రమే జరుగుతున్న హింస కాదు, మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇలాంటి దారుణాలు ఎదుర్కొనడంలేదు.. దేశమంతా ఇలాగే జరుగుతోంది.
ఏపీలో జరుగుతున్న హింసాత్మక పరిణామాల పట్ల గవర్నర్ జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి. ఏపీ ప్రజల వెంట మేముంటాం, వారి పోరాటానికి మేం మద్దతు పలుకుతాం" అని ప్రియాంక చతుర్వేది ఆవేశంగా ప్రసంగించారు.