Madanapalle: మదనపల్లె ఫైల్స్ దహనం ఘటన: సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్
- ఫైల్స్ దహనం కేసులో కొనసాగుతోన్న దర్యాఫ్తు
- కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్న ఏపీ సీఐడీ చీఫ్
- ఆదివారం అర్ధరాత్రి ఘటన
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కేసు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
గత ఆదివారం అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఆదివారం తగులబెట్టారు. ఈ ఘటనలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, దస్త్రాలు కాలిపోయాయి. అంతకుముందు కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తో పాటు పలువురు సిబ్బంది అక్కడే ఉన్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాఫ్తు జరిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేసే ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు 37 మంది సిబ్బందిని, పూర్వ ఆర్డీవో మురళిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఎవరెవరికి ఫోన్ చేశారు... ఎందుకు చేశారు? అనే కోణంలో విచారిస్తున్నారు.