Kanwar Yatra: కన్వర్ యాత్రపై పాక్ జర్నలిస్ట్ ప్రశ్న.. అమెరికా సమాధానం!
- ఉత్తరాఖండ్, యూపీలో కన్వర్ యాత్ర
- యాత్రసాగే మార్గాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లకు రెండు ప్రభుత్వాలు వివాదాస్పద ఆదేశాలు
- వాటి గురించి తమకు తెలుసన్న అమెరికా
- ఆ తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయం కూడా తెలుసని సమాధానం
- అన్ని మతాలను సమానంగా గౌరవించే విషయంలో భారత్తో కలిసి పనిచేస్తామన్న అగ్రరాజ్యం
కన్వర్ యాత్ర జరిగే మార్గాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన వివాదాస్పద ఆదేశాల గురించి తమకు తెలుసని అమెరికా తెలిపింది. అయితే, ఆ తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో అవి నిలిచిపోయాయని తెలిపింది. ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఇలా బదులిచ్చారు.
‘‘ఆ పరిణామాల గురించి మాకు తెలుసు. ఆ నిబంధనల అమలుపై స్టే విధిస్తూ భారత సుప్రీంకోర్టు ఈ నెల 22న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ నిబంధనలు నిజానికి అమల్లో లేవు’’ అని వివరించారు.
ప్రపంచంలో ఎక్కడైనా అందరికీ మతస్వేచ్ఛ హక్కును, విశ్వాసాలను గౌరవించడాన్ని తాము ప్రోత్సహిస్తామని, ఇందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే విషయంలో భారత్తో కలిసి పనిచేస్తామని నొక్కి చెప్పారు.
కాగా, కావడి యాత్ర జరిగే మార్గంలోని హోటళ్లు, రెస్టార్టెంట్లు, దాబాలు, ఇతర ఆహార విక్రేతలు తమ యజమానుల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలంటూ ఇటీవల యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. ఇవి కాస్తా వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం కాస్తా సుప్రీంకోర్టుకు చేరడంతో ఈ ఆదేశాలను అమలును నిలిపివేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.