Lavu Sri Krishna Devarayalu: పోలవరంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోలవరం ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ నేడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పోలవరం నిర్మాణం ఆలస్యానికి కారణం కాంట్రాక్టర్ ను మార్చడమేనని కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపింది. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు రూ.8,044.31 కోట్లు ఇచ్చామని స్పష్టం చేసింది. మూడేళ్లలో జరిగిన పనుల వివరాలను కేంద్రం లోక్ సభకు వివరించింది. మూడేళ్లలో పోలవరం కాంక్రీటు పనుల్లో కేవలం 5.03 శాతం జరిగాయని తెలిపింది.
పల్నాడు పరిస్థితి దారుణం: లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లాలో నీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు లోక్ సభలో మాట్లాడుతూ వెల్లడించారు. పల్నాడులో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, కేంద్రం రూ.350 కోట్ల మేర నిధులు ఇచ్చినా, గత ప్రభుత్వం వాటిని ఖర్చు చేయలేదని ఆరోపించారు. కనీసం ఇతర ప్రాంతాల నుంచి పల్నాడుకు నీళ్లు తరలించాలన్న ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేదని అన్నారు.
నీళ్లు లభించే ప్రాంతాల నుంచి నీటి తరలింపుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందించారు. శ్రీకృష్ణదేవరాయలు లేవనెత్తిన అంశం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని పేర్కొన్నారు. ఇది ప్రత్యేకంగా చూడాల్సిన అంశం అని అన్నారు.