Jasprit Bumrah: మేమంతా ఒకవైపు, ప్రపంచం ఒకవైపు.. హార్దిక్ పాండ్యా కాంట్రవర్సీపై బుమ్రా స్పందన
- హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఓటమి
- విమర్శల పాలైన హార్దిక్‌కు వెన్నంటే నిలిచామన్న జస్ప్రీత్ బుమ్రా
- టీమిండియా సభ్యులందరూ హార్దిక్‌కు అండగా ఉన్నారని వెల్లడి
- పాప్యులర్ క్రీడల్లో భాగమైన వారికి ఈ పరిస్థితి తప్పదని వ్యాఖ్య
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు చర్చనీయాంశంగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. దీనికి తోడు టోర్నీలో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాలతో చతికిలపడటం హార్దిక్‌కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. స్టేడియంలో ఫ్యాన్స్ అతడిపై బహిరంగ విమర్శలు చేశారు. అయితే, టీ20 ప్రపంచకప్ విజయంలో హార్దిక్ పాత్ర కీలకంగా మారాక పరిస్థితులు అతడికి అనుకూలంగా మారాయి. ఫ్యాన్స్‌లో అతడిపై మళ్లీ సానుకూల అభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాటి పరిణామాలపై జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఆ క్లిష్ట సమయంలో తామంతా హార్దిక్‌కు అండగా నిలిచామని చెప్పుకొచ్చాడు.
‘‘అభిమానుల భావాలను అర్థం చేసుకోగలం. ఈ దేశంలో క్రికెట్ ఓ భావోద్వేగం. అప్పుడప్పుడూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతుంటారు. క్రీడాకారులూ భావావేశాలకు లోనవుతారు. సొంత జట్టు అభిమానులే విమర్శలకు దిగడం ప్లేయర్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. జనాల్ని మనం అడ్డుకోలేం కదా! కాబట్టి విమర్శలను మనసుకు తాకనీయకుండా మన పనిపైనే దృష్టి పెట్టాలి. అయితే, దీన్ని పాటించడం అంత సులువేమీ కాదు. అభిమానుల విమర్శల అరుపులు మీ చెవిన పడుతూనే ఉంటాయి. దీన్ని ఓ జట్టుగా మేము ఎంకరేజ్ చేయము.
ఇక ఇలాంటి సందర్భాల్లో మన మనసుకు దగ్గరైన వారు అండగా నిలుస్తారు. టీమ్ సభ్యులందరూ అతడి వెన్నంటే ఉన్నారు. మేమంతా అతడితో నిత్యం మాట్లాడుతూనే ఉండేవాళ్లం. కుటుంబం కూడా అతడికి మద్దతుగా నిలిచింది. కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. కాబట్టి, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
ప్రపంచకప్ విజయం తరువాత పరిస్థితి మారింది. జనాలు జేజేలు పలుకుతున్నారు. కాబట్టి, చిన్న విషయాలకే అంతా అయిపోయినట్టు అనుకోకూడదు. మళ్లీ ఫ్యాన్స్ అభిప్రాయాల్లో మార్పులు వస్తాయి. అత్యంత పాప్యులర్ అయిన ఆట ఆడుతున్న కారణంగా ప్రతి క్రీడాకారుడు ఈ పరిస్థితులను ఎదుర్కొంటాడు. ఫుట్‌బాల్‌లో కూడా ఫ్యాన్స్ ఇలా చేస్తుంటారు. అత్యుత్తమ క్రీడాకారులకు కూడా ఈ పరిస్థితి తప్పదు. ఇది న్యాయం కాకపోయినప్పటికీ పరిస్థితిని యథాతథంగా స్వీకరించాల్సిందే.
ఓ టీంగా మేమ తోటి క్రీడాకారుడిని వదులుకోలేము. మేమందరం ఎప్పుడూ ఒకరికొకరం అన్నట్టుగా ఉంటాము. నేను హార్దిక్‌తో కూడా మ్యాచులు ఆడాను. మేమంతా ఓవైపు, ప్రపంచం మరోవైపు అన్నట్టు ఉంటుంది’’ అని జస్ప్రీత్ బుమ్రా కామెంట్ చేశాడు.