Narendra Modi: కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నా: ప్రధాని నరేంద్ర మోదీ
- నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్
- ద్రాస్ సెక్టార్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ
- నాడు సైనికుల ప్రాణత్యాగాలు తన మదిలో నిలిచిపోయాయని వెల్లడి
నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని వెల్లడించారు. దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటం తన మదిలో నిలిచిపోయిందని అన్నారు.
"లడఖ్ కార్గిల్ యుద్ధానికి సాక్షిగా నిలుస్తుంది. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జులై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. వీర సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కార్గిల్ విజయం ఏ ప్రభుత్వానిదీ కాదు... ఏ ఒక్క దళానికో చెందినది కాదు... కార్గిల్ విజయం దేశానిది.
జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నిలయంగా ఉంది. కశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్ కోసం ఎదురుచూస్తున్నారు. మౌలిక వసతులు, పర్యాటక రంగం వేగంగా పుంజుకుంటున్నాయి. కశ్మీర్ లో దశాబ్దాల తర్వాత సినిమా హాళ్లు తెరుచుకున్నాయి.
అటు, పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. శాంతి కోసం భారత్ ప్రయత్నిస్తే... పాకిస్థాన్ తన నిజస్వరూపం బయటపెట్టుకుంది. అయితే ధర్మం ముందు అధర్మం, ఉగ్రవాదం రెండూ ఓడిపోయాయి. పాకిస్థాన్ తన దుస్సాహసానికి తగిన మూల్యం చెల్లించుకుంది" అని వివరించారు.