Virat Kohli: 'భారత జట్టు పాక్లో పర్యటించాలి.. కోహ్లీ ఆడాలి' అంటూ ఎందుకో చెప్పిన పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ఖాన్
- కోహ్లీ కెరియర్లో పాకిస్థాన్ టూర్ లేకుండా పోయిందన్న యూనిస్ఖాన్
- అతడొచ్చి పాక్లో ఆడితే ఆ ముచ్చట కూడా తీరిపోతుందని వ్యాఖ్య
- కోహ్లీ పాకిస్థాన్లో ఆడాలనుకోవడం తమ కోరిక కూడా అని వెల్లడించిన మాజీ కెప్టెన్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించాలని.. కోహ్లీ పాక్లో ఆడాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ఖాన్ పేర్కొన్నాడు. కోహ్లీ కెరియర్లో పాక్ పర్యటన లోటుగా మిగిలిపోయిందని, అతడొచ్చి పాకిస్థాన్లో ఆడితే చూడాలని ఉందని, అది తమ కోరిక అని చెప్పుకొచ్చాడు.
‘‘2025 చాంపియన్స్ ట్రోఫీకి విరాట్ కోహ్లీ రావాలి. అది మా కోరిక కూడా. అతడొచ్చి పాకిస్థాన్లో ఆడాలి. కోహ్లీ కెరియర్లో పాకిస్థాన్ టూర్ లేకుండా పోయింది. కాబట్టి ఈ ట్రోఫీ కోసం అతడొచ్చి ఇక్కడ ఆడాలి’’ అని యూనిస్ఖాన్ పేర్కొన్నాడు.
కోహ్లీ 2008లో అంతర్జాతీయ కెరియర్ ప్రారంభించగా, అంతకు రెండేళ్ల ముందు అంటే 2006లో భారత జట్టు చివరిసారి పాక్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఆ తర్వాత మరెప్పుడూ టీమిండియా పాక్లో పర్యటించలేదు.
ఇక, వచ్చే పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తోంది. భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. దాయాది దేశం వెళ్లేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు దాదాపు లేవు. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో అనుసరించిన హైబ్రిడ్ విధానాన్నే చాంపియన్స్ ట్రోఫీలోనూ అనుసరించాలని బీసీసీఐ ప్రతిపాదిస్తున్న సంగతి విదితమే!