Drugs: దూల్‌పేట గంజాయి హబ్‌గా మారింది... ఎక్కడ దొరికినా మూలాలు ఇక్కడే: అబ్కారీ శాఖ
- సీఎం ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్న కమలాసన్ రెడ్డి
- మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి
- డ్రగ్స్ నియంత్రణకు వెయ్యిమంది పోలీసులకు శిక్షణ ఇచ్చామన్న కమలాసన్ రెడ్డి
హైదరాబాద్‌లోని దూల్‌పేట ప్రాంతం గంజాయి హబ్‌గా మారిందని, ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఇక్కడే కనిపిస్తున్నాయని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిరోజులుగా మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆపరేషన్‌లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దూల్పేటలో గతంలో నాటుసారాను నియంత్రించామని, ఇప్పుడు ఆ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి దొరికినా తీగలాగితే దూల్‌పేట పేరు వస్తోందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
పట్టుబడిన నిందితులకు శిక్షలు పడేవిధంగా కేసులను విచారిస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 31 లోపు దూల్‌పేటను గంజాయిరహిత ప్రాంతంగా చేస్తామని శపథం చేశారు. అన్ని ప్రాంతాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. నిందితులు శివారు ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేస్తున్నారని, వాటిని దూల్‌పేటకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ రెండు మూడు రోజుల్లోనే 66 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.