Yanamala: వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు: యనమల
టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు.
తాము అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలను సాక్షి వక్రీకరించిందని ఆరోపించారు. సాక్షితో పాటు వారి అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని అన్నారు. జగన్ తో పాటు సాక్షి, అనుబంధ మీడియా సంస్థలు సభా హక్కుల కమిటీ నోటీసులు ఎదుర్కోకతప్పదని యనమల స్పష్టం చేశారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటవగానే, శ్వేతపత్రాల్లోని అంశాలను వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.
రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని వైసీపీ నేతలు తమ జేబుల్లో నింపుకున్నారన్నది వాస్తవం అని యనమల పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలన అనంతరం ఇప్పుడు రాష్ట్రానికి లక్షల కోట్లలో అప్పులు మిగిలాయని వ్యాఖ్యానించారు. వాస్తవాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.