Vizag Steel Plant: మరో ఘనతను అందుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్

Vizag Steel Plant achieves 100 million tonnes steel production milestone
  • 1982లో ప్రారంభమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్
  • 1990 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు
  • ఇప్పటివరకు 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో విశిష్టత అందుకుంది. ఇప్పటివరకు 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడం ద్వారా రికార్డు సాధించింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్) ప్రారంభం నుంచి ఇప్పటివరకు 100 మిలియన్ టన్నుల (10 కోట్ల టన్నుల) అమ్మకానికి అవసరమైన ఉక్కు ఉత్పత్తి చేసింది. 

ఈ ఉక్కు పరిశ్రమ 1982 ఫిబ్రవరి 18న కార్యకలాపాలు ప్రారంభించింది. 1990లో పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇవాళ 100 మిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించింది. స్పెషల్ స్టీల్, రీబార్స్, ప్రొడక్ట్ మిక్స్, ప్లెయిన్ రౌండ్స్, ఫోర్జ్ డ్ రౌండ్స్, వైర్ రాడ్ కాయిల్స్ వంటి ఉత్పత్తులను విశాఖ స్టీల్ ప్లాంట్ అందిస్తోంది. 

ఏడాదికి 7.2 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ముడి సరుకు కొరత వేధిస్తోంది. అందుకే కొంతకాలంగా, ఒకటో బ్లాస్ట్ ఫర్నెస్ ను నిలిపివేసి... కేవలం 2, 3వ బ్లాస్ట్ ఫర్నెస్ లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ స్థితిగతులను స్వయంగా పరిశీలించిన ఆయన... ప్రధాని మోదీని ఒప్పించి, స్టీల్ ప్లాంట్ కు అవసరమైన మేర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Vizag Steel Plant
Steel Production
100 Million Tonnes
Milestone

More Telugu News