Telangana: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- 53 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- మధ్యాహ్నం సమయానికి 52 అడుగులు దాటిన నీటిమట్టం
- దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద నీరు
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలో వరద నీరు శనివారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 52 అడుగులు దాటింది. వరద నీరు పెరగడంతో కొన్ని గంటల్లోనే భద్రాచలం వద్ద నీటి మట్టం 53 అడుగులు తాకింది.
మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో, దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.