Andhra Pradesh: పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు ఆర్టీసీ బస్సు చోరీ!
- ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన
- మద్యం మత్తులో నిందితుడు బస్టాండ్ వద్ద నిలిపి ఉంచిన బస్సు చోరీ
- భార్యను చూసేందుకు అదే బస్సులో వెళుతూ పోలీసులకు చిక్కిన వైనం
- యజమాని ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుడికి వార్నింగ్‌తో సరిపెట్టిన పోలీసులు
మద్యం మత్తులో ఓ వ్యక్తి పుట్టింట్లో ఉన్న తన భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ అద్దె బస్సును చోరీ చేసిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో తాజాగా వెలుగు చూసింది. స్థానికంగా నివసించే దరగయ్య లారీ డ్రైవర్. ఇతడి భార్య పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రిలోని తన పుట్టింటికి వెళ్లారు. అయితే, ఆమెను చూసేందుకు ముచ్చుమర్రి వెళదామనుకున్న దరగయ్య శనివారం తెల్లవారుజామున ఆత్మకూరు బస్‌స్టాండ్‌కు వచ్చాడు. ఆ సమయంలో బస్సులేమీ లేకపోవడంతో సమీపంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కాడు. అందులో దాచి ఉంచిన తాళాలు వెతికి పట్టుకుని వాహనం స్టార్ట్ చేసి ముచ్చుమర్రికి బయలుదేరాడు. ఆ తరువాత కాసేపటికి అక్కడికి వచ్చిన మరో డ్రైవర్ తాను గత రాత్రి నిలిపి ఉంచిన బస్సు చోరీ అయ్యిందని భావించి వాహన యజమానికి సమాచారం అందించాడు.
ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా బస్సు నందికొట్కూరు వైపు వెళుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా, వెనక నుంచి వస్తున్న మిగతా బస్సులకు దరగయ్య దారి ఇవ్వకపోవడంతో వారికి అనుమానం వచ్చి యజమానికి సమాచారం అందించారు. దీంతో, ఆయన పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. పోలీసులు చోరీ అయిన బస్సును ముచ్చుమర్రి వద్ద ఆపి దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడు గతంలోనూ ఇలా మతిస్థిమితం లేని సందర్భాల్లో లారీలను తీసుకెళ్లేవాడని బంధువులు తెలిపారు. అయితే, ఘటనపై బస్సు యజమాని ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దరగయ్యను హెచ్చరించి పంపేశారు.