Khammam District: ఇష్టారీతిన విద్యార్థుల జుట్టు కత్తిరించిన ప్రభుత్వ టీచర్‌పై వేటు

govt teacher suspended in khammam after cutting students hair

  • ఖమ్మం జిల్లాలో ఘటన
  • విద్యార్థులు జుట్టు పెంచుకుని స్కూలుకు వస్తున్నారని టీచర్ ఆగ్రహం
  • 6-10వ తరగతులకు చెందిన 20 మంది విద్యార్థులకు ఇష్టారీతిన క్షవరం
  • తల్లిదండ్రుల ఆగ్రహం, టీచర్‌పై సస్పెన్షన్ వేటు

జుట్టు పెంచుకుని పాఠశాలకు వస్తున్న విద్యార్థులపై ఆగ్రహంతో వారికి ఇష్టారీతిన క్షవరం చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో డీఈఓ ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పేరువంచ జిల్లా పరిషత్ పాఠశాలలో దిగుమర్తి శిరీష ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు విద్యార్థులు జుట్టు బాగా పెంచుకుని పాఠశాలకు వస్తుండటంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు సూచించారు. 

వారు లెక్కచేయకపోవడంతో శనివారం 9, 10 తరగతుల్లో ఐదుగురు చొప్పున విద్యార్థులకు, 8వ తరగతిలో నలుగురు, 6,7 తరగతుల్లో ముగ్గురు చొప్పున విద్యార్థులకు జుట్టును ఇష్టారీతిన కత్తిరించారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు జరిగిన విషయం గురించి తెలిసింది. వారు పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీయగా.. పిల్లలు తమ వేషధారణలో క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని ఆమె చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి పంపించారు. ఇందుకు బాధ్యురాలైన టీచర్‌ను డీఈఓ సోమశేఖర శర్మ సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News