Mohammed Muizzu: రుణ చెల్లింపు విషయంలో ఊరట.. భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడి కృతజ్ఞతలు!

Maldives President Thanks India For Debt Relief Hopes For Free Trade Deal

  • భారత్‌కు 6.2 బిలియన్ రుఫియాలు బాకీ పడ్డ మాల్దీవులు
  • ముయిజ్జు అభ్యర్థన మేరకు రుణాల చెల్లింపును సులభతరం చేసిన భారత్
  • ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సాయపడ్డ భారత్‌కు ముయిజ్జు కృతజ్ఞతలు

రుణాల చెల్లింపును సులభతరం చేసినందుకు భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు తాజాగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని అభిలషించారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరాలని కూడా ఆకాంక్షించారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో ముయిజ్జు ప్రసంగించారు. గత ఎనిమిది నెలల్లో తాము దౌత్య పరంగా మంచి విజయాలు అందుకున్నామన్నారు. మాల్దీవులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాల చెల్లింపులను భారత్‌, చైనాలు సులభతరం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో డాలర్ల కొరతను తగ్గించేందుకు ఇరు దేశాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చిస్తున్నట్టు కూడా తెలిపారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, భారత్‌తో కూడా ఇలాంటి ఒప్పందం కుదరాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 
 
చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు గద్దెనెక్కాక భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లోని భారత సైనిక దళాలను వెనక్కి పంపించడమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో ప్రచారం చేసి ముయిజ్జు ఘన విజయం సాధించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీమార్గం పట్టారు. మోదీ ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. 

మాల్దీవుల ప్రభుత్వం గతంలో భారత్‌ నుంచి పలుమార్లు భారీ రుణాలు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రుణాల చెల్లింపులను సులభతరం చేయాలని భారత్‌ను అభ్యర్థించింది. మాల్దీవుల మీడియా ప్రకారం, గతేడాది చివరి నాటికి మాల్దీవులు భారత్‌కు 6.2 బిలియన్ల మాల్దీవుల రుఫియాలు బాకీ ఉంది. పరపతి విధానంలో మార్పులు చేయకపోతే రుణాల ఒత్తిడి పెరిగి ఇబ్బందులు మొదలవుతాయని మాల్దీవులను అంతర్జాతీయ ద్రవ్యనిధి ఈ ఏడాది మొదట్లోనే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్ కల్పించిన వెసులుబాటుపై ముయిజ్జు ధన్యవాదాలు తెలిపారు. భారత్, మాల్దీవులను సన్నిహిత మిత్రదేశాలుగా అభివర్ణించిన ఆయన ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News