Komatireddy Venkat Reddy: అసెంబ్లీలో కోమటిరెడ్డి, జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
- మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారన్న జగదీశ్ రెడ్డి
- నిరూపించకపోతే ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని సవాల్
- జగదీశ్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య సోమవారం మాటల యుద్ధం నడిచింది. జగదీశ్ రెడ్డిపై మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లిక్కర్ కేసులో ఉన్నానని, ఇంకేదో చేశానని కోమటిరెడ్డి తనపై తీవ్ర విమర్శలు చేశారని... వాటిని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతీ అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.
కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి... రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు. తాను రాజీనామా చేశాక తిరిగి ఇక రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే కోమటిరెడ్డి, ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు. వారు రాజీనామా కూడా చేయాలన్నారు.
సవాల్‌ను స్వీకరించిన కోమటిరెడ్డి
జగదీశ్ రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. జగదీశ్ రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడు అని ఆరోపించారు. దొంగతనం కేసులోనూ నిందితుడే అన్నారు. మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో ఏ2గా ఉన్నారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.