Revanth Reddy: తెలంగాణ సాధించినట్లు కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు... ఆ రికార్డ్స్ తీయండి: రేవంత్ రెడ్డి
- పార్లమెంట్‌లో కేసీఆర్ కనీసం నోరు తెరవలేదని విమర్శ
- తాను అసెంబ్లీలో, కేసీఆర్ పార్లమెంట్‌లో మాట్లాడిన రికార్డ్స్ తీయాలన్న సీఎం
- ఆత్మబలిదానాల శవాల మీద అధికారంలోకి వచ్చారని మండిపాటు
తెలంగాణ సాధించానని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని... కానీ ఆయన కనీసం పార్లమెంట్‌లో నోరు కూడా తెరవలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్‌లో కేసీఆర్ కనీసం నోరు తెరవకపోయినప్పటికీ తానే తెలంగాణ తెచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో తాను తెలంగాణ గురించి ఎంత మాట్లాడానో... అదే సమయంలో పార్లమెంట్‌లో కేసీఆర్ ఎంత మాట్లాడారో రికార్డ్స్ తీయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై కేసీఆర్ కనీసం నోరు తెరిచారా? అని ప్రశ్నించారు. ఎవరో త్యాగం చేస్తే... ఆ త్యాగాల పునాదుల మీద... ఆత్మబలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వారు ఈరోజు తమను తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు తీసుకురావాలని, ఈ పెట్టుబడుల ద్వారా నాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు హయాంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక హైదరాబాద్ నగరానికి, ఐటీ కంపెనీలకు ఒక్క క్షణం కోత లేకుండా విద్యుత్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతల ఆక్రోశం, ఆవేదన చూస్తుంటే వారు ఆల్రెడీ చర్లపల్లి జైల్లో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.