Madanapalle Incident: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు: ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
- మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఇటీవల ఫైళ్ల దగ్ధం
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా
- ముగ్గురి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించిన వైనం
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఫైళ్లు దగ్ధం అయిన ఘటనపై చర్యలు మొదలయ్యాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనలో మరికొందరు అధికారులపైనా వేటు పడింది. గతంలో మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుతం ఆర్డీవోగా ఉన్న హరిప్రసాద్ ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల ఆర్పీ సిసోడియా మదనపల్లె ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
గత ఆర్డీవో మురళి నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంలో కీలకపాత్ర పోషించారని, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఇక రికార్డుల తారుమారులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కీలకంగా వ్యవహరించాడని సిసోడియా తన నివేదికలో వివరించారు.