Pattadar Pass Book: ఏపీలో త్వరలో రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు
ఏపీలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందని విపక్షాలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేవలం రాజముద్రతో కూడిన కొత్త పాస్ బుక్ లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు చూపించారు. కొత్త పాస్ బుక్ పై క్యూఆర్ కోడ్ ను కూడా పొందుపరిచారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పట్టాదారు పేరిట ఉన్న ఆస్తుల వివరాలన్నీ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు, ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వివరాలతో కూడిన మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు.
సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రస్తావన వచ్చింది. పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజముద్ర తప్పనిసరిగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదని స్పష్టం చేశారు. అధికారులు చూపించిన కొత్త పాస్ పుస్తకాన్ని పరిశీలించిన చంద్రబాబు... పలు సూచనలు చేశారు.