Love Story: భర్త కోసం సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్థాన్ యువతి

Pakistan woman arrives India for husband


ఖండాంతర, దేశాంతర ప్రేమ కథలు కొత్తేమీ కాదు. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ స్పర్ధలు ఉన్నప్పటికీ... ఇరు దేశాలకు చెందిన యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 

తాజాగా, పాకిస్థాన్ కు చెందిన ఓ యువతి భారత్ లో ఉన్న తన ప్రియుడి కోసం సరిహద్దులు దాటి వచ్చేసింది. ఆమె పేరు మెహ్విష్ (25). పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ కు చెందిన మెహ్విష్ కు గతంలోనే పెళ్లి జరగ్గా, 2018లో భర్త నుంచి విడిపోయింది. అప్పటికే ఆమెకు 12, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. 

భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కువైట్ లో రవాణా రంగంలో పనిచేస్తున్న రెహ్మాన్ అనే యువకుడితో ఆమెకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. రెహ్మాన్ స్వస్థలం రాజస్థాన్ లోని బికనీర్. ఇద్దరూ తరచుగా చాటింగ్ చేసుకునేవారు. దాంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 

దాంతో పెళ్లి చేసుకోవాలని 2022లో నిర్ణయించుకున్నారు. మొదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. మెహ్విష్ 2023లో మక్కా యాత్రకు రాగా... రెహ్మాన్ కూడా మక్కా వచ్చి ఆమెను శాస్త్ర ప్రకారం పెళ్లాడాడు. ఆ తర్వాత మెహ్విష్ పాకిస్థాన్ వెళ్లిపోయింది. 

ఇటీవలే ఆమె ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళ్లి... అక్కడ్నించి వాఘా సరిహద్దుల ద్వారా భారత్ లో ప్రవేశించింది. 45 రోజుల టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చిన ఆమెకు రాజస్థాన్ లోని పిథిసార్ గ్రామంలో అత్తవారింట సాదర స్వాగతం లభించింది. సుదీర్ఘ విరామం తర్వాత భర్తను కలుసుకున్న మెహ్విష్ సంతోషం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News