Nara Lokesh: లోకేశ్ ప్రజాదర్బార్‌కు పోటెత్తుతున్న ప్రజలు.. నేనున్నానని భరోసా ఇస్తున్న మంత్రి

People across Andhra Pradesh came to Undavalli Lokesh Praja Darbar

  • తెల్లవారుజాము నుంచే క్యూ కట్టిన ప్రజలు
  • ప్రతి ఒక్కరి నుంచి స్వయంగా వినతులు స్వీకరిస్తున్న లోకేశ్
  • వారి సమస్యలను ఓపిగ్గా వింటూ అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు

మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు ప్రజలు పోటెత్తుతున్నారు. నేడు 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేశ్.. వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్‌లో లోకేశ్ ప్రతి ఒక్కరినీ స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

మంగళగిరి నియోజకవర్గం పెద్ద కొండూరుకు చెందిన పి.మాచమ్మ లోకేశ్‌తో తమ సమస్యను చెప్పుకొచ్చారు. గ్రామంలో తనకున్న 60 సెంట్ల భూమి ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. అడంగల్ లో రికార్డు సవరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మార్కెట్ యార్డులో స్వీపర్ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని జి.వీరమ్మ అనే మహిళ కోరారు. ఆమె విజ్ఞప్తిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం శృంగారపురానికి చెందిన మొవ్వా చంద్రశేఖర్ రావు, పొట్లూరి గౌతమ్, కావూరి నరసింహారావు నారా లోకేశ్ ను కలిశారు. విశాఖ మధురవాడలో నేషనల్ హైవే-5, బీచ్ రోడ్డు విస్తరణలో తమ భూములు కోల్పోయామని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురానికి చెందిన ఇరుగుదిండ్ల నాగమ్మ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. గ్రామంలో దశాబ్దాలుగా తన భర్త పేరుపై ఉన్న 5.73 ఎకరాల డి-పట్టా భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు దస్తావేజులతో నకిలీ పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు సృష్టించారని తెలిపారు. కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. సదరు ఫిర్యాదుపై స్పందించిన మంత్రి.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన వడ్డే తిరుపాలు మంత్రి లోకేశ్‌ను కలిశారు. 2014-19 మధ్య గ్రామంలో అంగన్ వాడీ పాఠశాల భవనం, సీసీ రోడ్డు, ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లు నిర్మించానని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో బిల్లులు మంజూరుకాక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రజాప్రభుత్వంలో బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్టీసీలోని విజిలెన్స్, సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తమకు 11వ వేతన సవరణ ద్వారా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీఎస్ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

ఏపీ సీఆర్ డీఏలో పనిచేస్తున్న డ్రైవర్లు, అటెండర్లను వీజీటీఎం ఉడా కేడర్ లో ఉన్న రెగ్యులర్ పోస్టుల్లో నియమించాలని యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు.  

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు, హిందీ భాషోపాధ్యాయుల పదోన్నతులు, సర్వీసును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.  

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన వి.హేమలత మంత్రి లోకేశ్ కలిశారు. 17 ఏళ్ల తన కుమారుడు రెండు నెలలుగా అదృశ్యమయ్యాడని, ఎంత వెతకినా జాడ కనిపించలేదని కన్నీటిపర్యంతమయ్యారు. కుమారుడు అదృశ్యంపై రాజాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఎలాంటి ఆధారం లేని తమ కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ గొల్లపూడికి చెందిన మండవ వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 

హెచ్ఐవీ, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న తమకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన పరసా వెంకటలక్ష్మి దంపతులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

    

  • Loading...

More Telugu News