Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- పల్నాడు జిల్లాలో అటవీశాఖ ఉద్యోగులపై స్మగర్ల దాడి
- ఇద్దరు అధికారులకు గాయాలు
- ఘటనను తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్
వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా చర్యలు తప్పవని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విజయపురి సౌత్ రేంజిలో అటవీ ఉద్యోగులపై దాడి ఘటన పట్ల పవన్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆయన పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. వన్యప్రాణుల అక్రమ రవాణాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల వద్ద జంతువుల అక్రమ రవాణాదారులు అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసి గాయపర్చడం తెలిసిందే. స్మగర్ల దాడిలో రేంజి ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, బీట్ ఆఫీసర్ మహేశ్ బాబులకు గాయాలయ్యాయి. కాగా, జంతువుల స్మగ్లర్లు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది.