Bakka Jadson: రేవంత్ రెడ్డి, చంద్రబాబులపై బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు
- ఓటుకు నోటుతో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిందే టీడీపీ అన్న జడ్సన్
- ఆ తర్వాతే కేసీఆర్ కళ్లు తెరిచి టీడీపీ నేతలను తీసుకున్నారని వ్యాఖ్య
- బ్లాక్ మెయిల్ చేయడానికే రేవంత్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణ
అసలు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. అసలు ఈ విషయాన్ని బీఆర్ఎస్ వారు కూడా చెప్పలేకపోతున్నారన్నారు. పదేళ్ల క్రితం రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్నారు. అదే ఓటుకు నోటు కేసు అని గుర్తు చేశారు.
2014లో టీడీపీకి ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందే టీడీపీ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ కళ్లు తెరిచి టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారన్నారు. అందుకే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలును ప్రారంభించింది టీడీపీయే అన్నారు. దీనిని ఈ రోజు వరకు ఎవరూ చెప్పడం లేదన్నారు.
అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది 63 సీట్లు మాత్రమేనని.. టీడీపీ ఏ సమయంలో అయినా తన ప్రభుత్వాన్ని కూలగొడుతుందనే భయంతో టీడీపీ వారిని చేర్చుకున్నారని తెలిపారు. ఇక, 2018లో కేసీఆర్ తన పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకునే సమయంలో భట్టివిక్రమార్క సహా ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు. తాను మాత్రమే ప్రశ్నించానన్నారు. తనను నాటి ప్రభుత్వం హౌస్ అరెస్ట్ కూడా చేసిందన్నారు.
బ్లాక్ మెయిల్ చేయడానికి....
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు తాము తీసుకుంటే తప్పేమిటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని మండిపడ్డారు. కానీ అంతర్గత అజెండా వేరుగా ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు చేరారని, మరో 10 మందిని చేర్చుకుంటారని జోస్యం చెప్పారు. రేపు అధిష్ఠానం ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి ఏర్పడినప్పుడు... ఆయన బ్లాక్ మెయిల్ చేస్తారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
సీఎంను మారిస్తే తన వైపు ఉన్న ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి బీజేపీతో లేదా మరో పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటానని కాంగ్రెస్ పెద్దలను బ్లాక్ మెయిల్ చేస్తారన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉందని... కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు సంపాదన కోసం మాత్రమే చేరుతున్నారని అన్నారు. కాబట్టి వారు కూడా రేవంత్ రెడ్డి వైపు ఉండరని... ఎవరు సీఎం అయితే వారి వైపు ఉంటారన్నారు.