Rahul Dravid: ఎకానమీ క్లాస్‌లో నిద్రపోయిన ద్రావిడ్!

Rahul Dravid Slept In Economy Section while T20 WC Flight Out to New Delhi

  • టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన జట్టుతో ఢిల్లీ వస్తున్న ఫ్లైట్‌లో సందడి వాతావరణం
  • ఏ ఆటగాడూ 6 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోని వైనం
  • నిద్ర కోసం ఎకానమీ క్లాస్‌కు వెళ్లిన రాహుల్ ద్రావిడ్

భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి నెల రోజులైంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి సుదీర్ఘకాలం తర్వాత మరో టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయం భారతీయ క్రికెట్ అభిమానులను సంతోషంలో నింపింది. కాగా ఫైనల్ విజయం అనంతరం టీమిండియా స్వదేశానికి తిరిగి రావడం కాస్త ఆలస్యమైంది. హరికేన్ కారణంగా విమానాలు రద్దవడంతో జట్టు బార్బడోస్‌లోనే రెండు రోజులు వేచిచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రత్యేక విమానంలో 16 గంటల పాటు ప్రయాణం చేసి టీమిండియా న్యూఢిల్లీ చేరుకుంది. ఈ విమానంలో టీమిండియా ఆటగాళ్లే కాకుండా.. బార్బడోస్ లో చిక్కుకున్న కొంతమంది జర్నలిస్టులు కూడా ప్రయాణించారు.

అయితే ఆ ఫ్లైట్‌లో ఆటగాళ్లు ఎవరూ 6 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోలేదని ఫ్లైట్ ప్రొడ్యూసర్ ఒకరు వెల్లడించారు. జర్నీకి సంబంధించిన వివరాలు తెలిపారు. కొద్దిసేపు నిద్రపోవాలని భావించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎకానమీ క్లాస్‌లో నిద్రపోవాల్సి వచ్చిందని తెలిపారు.

‘‘6 గంటల కంటే ఎవరూ ఎక్కువసేపు నిద్రపోలేదని నేను అనుకుంటున్నాను. ఫ్లైట్‌లో ఎవరూ నిశబ్దంగా లేరు. అందరూ ఒకేచోట కలిసి ఉన్నారు. క్రీడాకారులు మీడియా సభ్యులతో మాట్లాడారు. స్టార్ స్పోర్ట్స్ ఇంజనీర్లు ఆ విమానంలో ప్రయాణించారు. వారికి కూడా అదే విమానంలో ప్రయాణ సౌకర్యం కల్పించారు. రోహిత్ శర్మ చాలా సార్లు బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీ క్లాస్‌కు వచ్చి వెళ్తుండేవాడు. ఒక సమయంలో నిద్రపోవాలని భావించిన రాహుల్ ద్రావిడ్ వచ్చి ఎకానమీ క్లాస్‌లో 4-సీటర్ కోసం వెతికారు. కొద్దిసేపు పడుకున్నారు’’ అని ఫ్లైట్ ప్రొడ్యూసర్ పేర్కొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరినో సరదాగా తిట్టడం తనకు నిద్రలో వినిపించిందని అన్నారు.

రోహిత్ శర్మ అక్కడే నిలబడి ఉండడం తనకు కనిపించిందని, రోహిత్ తన స్టైల్‌లో సరదాగా తిట్టాడని, ఆ సమయంలో హార్దిక్, రిషబ్ పంత్ వచ్చారని, వారంతా మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాగా విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లేకుండా విమానంలో సందడి వాతావరణం కొనసాగిందని దీనిని బట్టి అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News