Vidadala Rajini: ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: విడదల రజని
- ఆరోగ్యశ్రీపై కూటమి సర్కారు దుష్ప్రచారం చేస్తోందన్న రజని
- జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించామని వెల్లడి
- గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలు కూడా చెల్లించామని స్పష్టీకరణ
ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత, వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని అన్నారు. జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా, ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజని స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అప్పులు, బకాయిలు అని దుష్ప్రచారం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెబుతుండడం చూస్తుంటే ఆ అనుమానాలకు బలం చేకూరుతోందని రజని పేర్కొన్నారు. చంద్రబాబు మనసులో ఉన్న మాటనే మంత్రులు చెబుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తున్నారని, ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై రజని ధ్వజమెత్తారు. పేదవాళ్ల కోసమే జగన్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచారని తెలిపారు.