Gautam Gambhir: స్పిన్ పిచ్ లపై ఇలా ఆడితే కుదరదు: గంభీర్
- నిన్న పల్లెకెలెలో టీమిండియా-శ్రీలంక చివరి టీ20 మ్యాచ్
- సూపర్ ఓవర్ ద్వారా నెగ్గిన టీమిండియా
- వికెట్ల పండగ చేసుకున్న ఇరుజట్ల స్పిన్నర్లు
- పల్లెకెలె పిచ్ పై నరకం చూసిన బ్యాటర్లు
గతరాత్రి శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన పల్లెకెలె పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా నిలిచింది. ఆఖరికి సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లు కూడా వికెట్ల పంట పండించారు. ఈ పిచ్ పై బ్యాటింగ్ ఇరుజట్ల ఆటగాళ్లకు ఓ పీడకలలా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు.
దీనిపై టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఇలాంటి పిచ్ పై పట్టుదలతో ఆడి విజయం సాధించడం గొప్ప విషయమే అని టీమిండియా ఆటగాళ్లను పొగిడిన గంభీర్... అదే సమయంలో, స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బంతి సుడులు తిరిగే ఇలాంటి పిచ్ లపై ఆడాలంటే బ్యాటింగ్ ఇంకా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. నిన్నటి మ్యాచ్ లో చివరి వరకు పోరాడడం మాత్రం టీమిండియా జట్టులో మెచ్చుకోదగిన అంశం అని గంభీర్ పేర్కొన్నాడు.
ఈ తరహా పరిస్థితుల్లో కడవరకు పోరాడడం వల్లే మ్యాచ్ ఫలితం అనుకూలంగా వస్తుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి బంతికి, ప్రతి పరుగుకు పోరాటం కనబర్చడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితం వస్తుందనడానికి నిన్నటి మ్యాచ్ ఓ ఉదాహరణగా నిలుస్తుందని గంభీర్ వెల్లడించాడు.