Wayanad Landslides: ఇది నిందలు మోపుకునే సమయం కాదు: అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ సీఎం స్పందన
- కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర విపత్తు
- కొండచరియలు విరిగిపడిన ఘటనలో 200 మంది మృత్యువాత
- వారం రోజుల ముందే ఈ విపత్తుపై హెచ్చరించామన్న అమిత్ షా
- కొండచరియలు విరిగిపడ్డాక రెడ్ అలర్ట్ మెసేజ్ ఇచ్చారన్న సీఎం విజయన్
వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని వారం రోజుల కిందటే కేరళను హెచ్చరించామని, కానీ తగిన చర్యలు తీసుకోవడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాజ్యసభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కేరళ సీఎం విజయన్ స్పందించారు.
ఇది నిందలు మోపుకునే సమయం కాదని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి (అమిత్ షా) చెప్పిన కొన్ని అంశాలు నిజమేనని, కొన్ని మాత్రం అవాస్తవాలని విజయన్ స్పష్టం చేశారు.
"వయనాడ్ ప్రజలు కొండచరియలు విరిగిపడిన ఘటనతో తీవ్ర విషాదానికి గురై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి తెరలేపాలని అనుకోవడంలేదు. వాస్తవం ఏంటంటే... వయనాడ్ లో కొండచరియలు విరిగిపడొచ్చన్న అంచనాలు మాత్రం వెలువడ్డాయి.. అయితే ఆ అంచనాలు రెడ్ అలెర్ట్ స్థాయిలో ఉన్నాయని ప్రస్తావించలేదు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రెడ్ అలెర్ట్ సందేశం వచ్చింది. అప్పటికి కొన్ని గంటల ముందే విపత్తు సంభవించింది. ఐఎండీ వెలువరించిన అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో మీది తప్పంటే మీది తప్పని వాదనలు చేయలేం" అని సీఎం విజయన్ వ్యాఖ్యానించారు.