Andhra Pradesh: ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ .. వారికి షాక్
- ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీల బదిలీ
- 57 మంది డీఎస్పీలకు నో పోస్టింగ్
- సీఐడీ, విజిలెన్స్ అధికారుల బదిలీ
ఏపీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగారన్న అభియోగాలు ఉన్న డీఎస్పీలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడా పోస్టింగ్ లు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డీఎస్పీల్లో దాదాపు 57 మందిని డీజీపీ (హెడ్ క్వార్టర్స్) కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివాద రహితంగా వ్యవహరించిన వారిని డీఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీతో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.
వైసీపీ హయాంలో లూప్ లైన్ లో, అప్రాధాన్యత విభాగాల్లో కొనసాగుతూ వచ్చిన డీఎస్పీలకు ఈ సర్కార్ లో కీలక పోస్టింగ్ లు, సబ్ డివిజన్ లను కేటాయించవచ్చని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో .. టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.