IMD: జులై 30న కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేశాం: ఐఎండీ చీఫ్ మహాపాత్ర
- వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడి
- ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకూ హెచ్చరికలు జారీ చేశామన్న ఐఎండీ
- వాయనాడ్ ఘటనపై అమిత్ షా వర్సెస్ విజయన్ నేపథ్యంలో ప్రకటన
కేరళకు జులై 30 తెల్లవారుజామున రెడ్ అలర్ట్‌ను ప్రకటించామని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్రమపద్ధతిలో సూచనలు... హెచ్చరికలు జారీ చేస్తూనే ఉందన్నారు. జులై 30న రెడ్ అలర్ట్ జారీ చేశామని, అదే రోజు కొండచరియలు విరిగిపడ్డాయన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా వాయనాడ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశముందని కేంద్రం హెచ్చరించినా కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న (జూలై 31) ఆవేదన వ్యక్తం చేశారు.
జూలై 30 ఉదయం వాయనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాయనాడ్‌లో ప్రకృతి వైపరీత్యంపై కేంద్రం ముందే హెచ్చరించినట్లు అమిత్ షా తెలిపారు. అయితే వాతావరణ శాఖ కేవలం ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని సీఎం విజయన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ చీఫ్ వివరణ ఇచ్చారు.