Venkatareddy: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణ
- వైసీపీ హయాంలో మైనింగ్ అక్రమాలు జరిగాయంటున్న కూటమి ప్రభుత్వం
- వెంకటరెడ్డిపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ
- నివేదికను ఏసీబీకి పంపిన రాష్ట్ర ప్రభుత్వం
- ఇటీవల బదిలీ చేయగానే హైదరాబాద్ వెళ్లిపోయిన వెంకటరెడ్డి!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గనుల శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. గనుల శాఖ ఫైళ్లు బయటికి పోకుండా ఏపీఎండీసీ కార్యాలయాన్ని సీజ్ చేసింది. వైసీపీ హయాంలో ఏపీఎండీసీ ఎండీగా వ్యవహరించిన వెంకటరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చర్యలకు ఉపక్రమించింది. వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది.
ఇప్పటికే వెంకటరెడ్డిపై శాఖాపరమైన విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అందించింది.
కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంకటరెడ్డిపై బదిలీ వేటు వేయగా... ఆయన హైదరాబాద్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 2021 నుంచి 2024 మధ్య గనుల శాఖలో జరిగిన పలు అక్రమాలకు వెంకటరెడ్డే బాధ్యుడని... గనులు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ విషయంలో ఎన్జీటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కారన్న ఆరోపణలను వెంకటరెడ్డి ఎదుర్కొంటున్నారు.