Amaravati: నేడు అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం రాక

A team of IIT experts to Amaravati today

  • ఏపీలో రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం చేయడంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం
  • రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాల పరిశీలన
  • గతంలో నిర్మాణ పనులు నిలిచిపోయిన భవనాల పటిష్ఠతపై అధ్యయనం

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు ఈ పర్యటనలో భాగంగా అధ్యయనం చేయనున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులను ఎక్కడికక్కడ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2019కి ముందు నిర్మాణం ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా...మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో నిర్మాణం నిలిచిపోయిన కట్టడాల పటిష్ఠతపై ముందుగా ఒక అంచనాకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఈ  క్రమంలో గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపై ఐఐటీ ఇంజనీర్‌లతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్ఠత నిర్ధారణ కోసం ఐఐటీ చెన్నైకి బాధ్యతలు అప్పగించింది. అలానే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్ఠతను తేల్చేపనిని ఐఐటీ హైదరాబాద్‌కు అప్పగించినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఐఐటీ నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో 2019కు ముందు నిర్మాణ పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటి ఇంజినీర్లు నేడు అమరావతికి రానున్నారు. ఆయా నిర్మాణాల పటిష్ఠత, ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలించనున్నారు.
 
సెక్రటేరియట్, హెచ్‌ఓడీ కార్యాలయాల టవర్లతో పాటు హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్‌లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్ధ్యాన్ని ఐఐటీ బృందం పరిశీలించనుంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌ల నుంచి ఇద్దరు ఇంజినీర్లున్న రెండు బృందాలు అమరావతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నాయి. అక్కడి కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశవుతారు. ఈ విషయాన్ని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం తెలిపింది.

  • Loading...

More Telugu News