Intel: 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన
- 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోనున్నట్టు ప్రకటన
- మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలతో గట్టి పోటీ పెరిగిన వేళ ఇంటెల్ నిర్ణయం
అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది. ముఖ్యమైన ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకున్నప్పటికీ రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో పరిస్థితులు మరింత సవాళ్లతో కూడి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు.
కాగా ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15 శాతం మందిని తొలగిస్తే దాదాపు 18,000 మందిపై ప్రభావం పడొచ్చని అంచనాగా ఉంది. ప్రత్యర్థులు ఎన్వీడియా, ఏఎమ్‌డీ మరియు క్వాల్‌కామ్‌ల నుండి బలమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని ప్రకటించిన నెల తర్వాత ఈ కఠిన నిర్ణయాలు ప్రకటించింది. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం సరికొత్త సాంకేతికతలను ఆవిష్కరించడంతో ఆ కంపెనీకి మార్కెట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇంటెల్‌కు గట్టి పోటీ!
కొన్ని దశాబ్దాలపాటు ల్యాప్‌టాప్‌ల నుంచి డేటా సెంటర్ల వరకు ఇంటెల్ చిప్‌ల ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ కంపెనీకి పోటీ పెరిగిపోయింది. ఎన్వీడియా, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్‌ల నుంచి ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసర్ల మీద ప్రత్యేక దృష్టిసారించిన ఎన్వీడియా నుంచి ఇంటెల్ కంపెనీకి మార్కెట్లో పోటీ ఎదురవుతోంది.